విద్యుత్ సమాచారం online shopping http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Powered by Blogger.

నా గురించి విషయాలు

BTemplates.com

Blogroll

Monday, May 30, 2016

ఇన్వర్టర్ కొంటున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి



Related Image


   విద్యుత్ సరఫరాలో కోతలు.. చిన్న వర్షం కురిసినా, కొంచెం గట్టిగా గాలి వీచినా కరెంటు పోతుంది. ఒక్కోసారి కొన్ని గంటల పాటు సరఫరా ఉండదు. దీంతో ఎన్నో ఇబ్బందులు. చిన్న పిల్లలు, పెద్ద వయసువారు ఉన్నచోట సమస్యలు మరీ ఎక్కువ. అలాంటి సమయాల్లో విద్యుత్ అవసరాలను తీర్చేవే ఇన్వర్టర్లు, యూపీఎస్ లు. సు-కమ్, లూమినస్, మైక్రోటెక్, ఎక్సైడ్, వీగార్డ్ వంటి చాలా కంపెనీల ఇన్వర్టర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ ఇంటికిగానీ, ఆఫీసుకుగానీ ఎంత సామర్థ్యమున్నవి అవసరం? అసలు ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్ల వంటి విద్యుత్ ఉపకరణాలు ఎంతెంత విద్యుత్ వినియోగించుకుంటాయి? ఏయే ఉపకరణాలు వినియోగించాలంటే ఎలాంటి ఇన్వర్టర్ తీసుకోవాలి? మార్కెట్లో ఎన్నో రకాలున్నా దేనిని ఎంచుకోవాలి... ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇన్వర్టర్, యూపీఎస్ రెండూ దాదాపుగా ఒకే రకమైన పనితీరుతో ఉంటాయి. వీటిలో ఉండే స్వల్పమైన తేడా ఏమిటంటే... ఇన్వర్టర్ విద్యుత్ సరఫరా ఆగిపోయాక 100 మిల్లీ సెకన్ల సమయంలో సరఫరాను పునరుద్ధరిస్తుంది. అదే యూపీఎస్ కేవలం 15 నుంచి 20 మిల్లీ సెకన్లలోపే సరఫరా చేస్తుంది. సాధారణంగా కంప్యూటర్ల వంటి వాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగితే.. అప్పటివరకూ మనం చేస్తున్న పనిని నష్టపోతాం. అందువల్ల కంప్యూటర్లను వినియోగించే కార్యాలయాలు, షాపులకు యూపీఎస్ వ్యవస్థ అవసరం. మిగతా వారు ఇన్వర్టర్ ను తీసుకోవచ్చు.
ఇన్వర్టర్లలోనూ రెండు రకాలు
మనకు మార్కెట్లో రెండు రకాల ఇన్వర్టర్లు లభిస్తుంటాయి. ఒకటి ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్, రెండోది స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ (దీనిని మోడిఫైడ్ సైన్ వేవ్ ఇన్వర్టర్ అని కూడా అంటారు). టీవీలు, కంప్యూటర్లు వంటి సున్నిత ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూ ఉంటే ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ తీసుకోవాలి. కానీ దీని ధర కాస్త ఎక్కువ. ఇక బల్బులు, ఫ్యాన్లు వంటివి మాత్రమే వాడేవారు తక్కువ ధరకు దొరికే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ తీసుకుంటే సరిపోతుంది. అయితే సీలింగ్ ఫ్యాన్లు వంటివి వాడితే స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ నుంచి చాలా స్వల్పంగా శబ్దం వస్తుంటుంది.
రెండు ప్రధాన భాగాలు
ఇన్వర్టర్, యూపీఎస్ రెండు వ్యవస్థల్లోనూ రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకటి విద్యుత్ ను నిల్వ చేసే బ్యాటరీలు అయితే.. రెండోది ఇన్వర్టర్ కం కన్వర్టర్. సాధారణంగా బ్యాటరీల్లో విద్యుత్ డీసీ (డైరెక్ట్ కరెంట్) రూపంలో నిల్వ అవుతుంది. మనం వినియోగించేది ఏసీ (ఆల్టర్నేట్ కరెంట్) విద్యుత్. ఇన్వర్టర్ ఈ సాధారణ ఏసీ విద్యుత్ ను డీసీ రూపంలోకి మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తుంది, అవసరమైనప్పుడు తిరిగి వినియోగానికి వీలుగా ఏసీ విద్యుత్ గా మార్చి సరఫరా చేస్తుంది. ఇదే సమయంలో విద్యుత్ సరఫరాను నియంత్రిస్తుంది. విద్యుత్ కోతల సమయంలో మనకు అవసరమైన కరెంటు స్థాయిని బట్టి ఇన్వర్టర్ కం కన్వర్టర్, బ్యాటరీల సామర్థ్యాన్ని ఎంచుకోవచ్చు. ఇన్వర్టర్ సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఎక్కువ పరికరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం విద్యుత్ సరఫరా అవుతుంది.
మనకు అవసరమెంత?
విద్యుత్ కోతల సమయంలో మనం ఏయే ఉపకరణాలను వినియోగించుకుంటాం, ఎంతసేపటి వరకు కరెంటు అవసరం పడుతుందనే దానిపై ఒక స్పష్టతకు రావాలి. ఉదాహరణకు సింగల్ బెడ్ రూం ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టీవీ అవసరం. అదే ఎక్కువమంది ఉండే డబుల్, త్రిబుల్ బెడ్ రూం ఇళ్లలో నాలుగైదు బల్బులు, నాలుగు వరకు ఫ్యాన్లు, టీవీ, ఇతర అవసరాలు ఉంటాయి. అవసరమైతే రిఫ్రిజిరేటర్, కూలర్లు వంటి వాటికీ విద్యుత్ కావాలనుకునేవారూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల విద్యుత్ కోతలు రెండు మూడు గంటలకు మించి ఉండవు, మరికొన్ని చోట్ల ఐదారు గంటల వరకూ కరెంటు రాదు. అంటే తక్కువ పరికరాలకు అయినా ఎక్కువ సేపు కరెంటు అవసరమా?, తక్కువ సమయం వచ్చినా సరే అన్ని పరికరాలకూ కరెంటు కావాలా? అన్నది అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
ఏ పరికరానికి ఎంత విద్యుత్ అవసరం
  • సాధారణ సీలింగ్ ఫ్యాన్ కు 75 నుంచి 90 వాట్లు
  • సాధారణ ట్యూబ్ లైట్ కు 45 నుంచి 50 వాట్లు, టీ5 ట్యూబ్ లైట్లకు 28 వాట్లు
  • సీఎఫ్ఎల్ బల్బులు 15 నుంచి 25 వాట్ల వరకు (పరిమాణాన్ని బట్టి)
  • సాధారణ టీవీలకు 120 వాట్లు, ఎల్ సీడీ టీవీలకు 50 నుంచి 150 వాట్లు, ఎల్ ఈడీ టీవీలకు 30 నుంచి 100 వాట్లు (పరిమాణాన్ని బట్టి)
  • సాధారణ సెట్ టాప్ బాక్సులకు 8 వాట్లు, హెచ్ డీ టీవీ బాక్సులు 18 వాట్లు, హెచ్ డీ డీవీఆర్ బాక్సులకు 25 వాట్లు
  • డెస్క్ టాప్ కంప్యూటర్లు ఎల్ సీడీ, ఎల్ ఈడీ మానిటర్లు ఉన్నవాటికి 150 వాట్ల వరకు, సీఆర్ టీ మానిటర్లు ఉన్నవాటికి 250 వాట్ల వరకు..
  • ల్యాప్ టాప్ కంప్యూటర్ కు 50 వాట్లు
  • వైఫై రూటర్లు, మోడెమ్ లు, మొబైల్ ఫోన్ చార్జర్ల వంటి వాటికి 5 వాట్ల వరకు
  • హోం థియేటర్లకు మోడల్, సైజును బట్టి 100 వాట్ల వరకు
  • సాధారణ ఎయిర్ కూలర్ కు 250 నుంచి 350 వాట్లు
  • వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్ గ్రైండర్లకు 350 వాట్లు (పరిమాణాన్ని బట్టి)
  • ఇండక్షన్ కుక్కర్లకు 1000 నుంచి 1500 వాట్లు
  • ఏసీలకు పరిమాణాన్ని బట్టి 1500 వాట్ల నుంచి 5000 వాట్ల వరకు విద్యుత్ సామర్థ్యం అవసరం
సాధారణ అవసరాలను తీసుకుంటే...
ఉదాహరణకు ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక సీఎఫ్ఎల్, ఒక సాధారణ టీవీకి విద్యుత్ అవసరం అనుకుంటే వాటికి (90+50+25+120 = 285) 285 వాట్ల సామర్థ్యంతో విద్యుత్ అవసరం. ఇదే సామర్థ్యంతో ఆరు గంటల పాటు విద్యుత్ అవసరం అనుకుంటే... 285*6 = 1710 వాట్ అవర్ (1.71 కిలోవాట్ అవర్) విద్యుత్ ను నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇన్వర్టర్ సామర్థ్యం ఎంత అవసరం..
పైన అనుకున్నట్లుగా ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక సీఎఫ్ఎల్, ఒక సాధారణ టీవీకి కలిపి 285 వాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం అవసరం. సాధారణంగా ఇంతే వీఏ సామర్థ్యమున్న ఇన్వర్టర్ సరిపోతుంది. కానీ విద్యుత్ నిల్వ, సరఫరా నష్టాలు, పరికరాల అదనపు వినియోగాన్ని పరిగణించి 25 శాతం నుంచి 30 శాతం అదనంగా కలుపుకోవాలి. దీన్నే పవర్ ఫ్యాక్టర్ అంటారు. 25 శాతం పవర్ ఫ్యాక్టర్ ను లెక్కించినా 285+71 = 356 వాట్స్ వస్తుంది. సరిగా ఇంతే సామర్థ్యమున్న ఇన్వర్టర్ మార్కెట్లో దొరకదు కాబట్టి.. దీనికి దగ్గరగా ఉండే 400 వీఏ సామర్థ్యమున్న ఇన్వర్టర్ కొనుక్కోవచ్చు.
ఎంత సామర్థ్యమున్న బ్యాటరీ తీసుకోవాలి
పైన వేసుకున్న అంచనా ప్రకారం... ఫ్యాక్టర్ ను కలిపి లెక్కిస్తే మనకు 356 వీఏ సామర్థ్యమున్న ఇన్వర్టర్ అవసరం. ఈ 356 వీఏతో 6 గంటల పాటు కరెంటు సరఫరా కావాలంటే 356*6 = 2136 వీఏహెచ్ విద్యుత్ అవసరం. సాధారణంగా బ్యాటరీలు 12 వోల్టుల సరఫరా సామర్థ్యంతో ఉంటాయి. ఈ లెక్కన 2136/12 = 178 ఏహెచ్ బ్యాటరీ అవసరం. మార్కెట్లో 100 ఏహెచ్, 120 ఏహెచ్, 150 ఏహెచ్, 180 ఏహెచ్, 200 ఏహెచ్ బ్యాటరీలు లభిస్తాయి. దీని ఆధారంగా 180 ఏహెచ్ బ్యాటరీ తీసుకుంటే సరిపోతుంది. అంటే 400 వీఏ సామర్థ్యమున్న ఇన్వర్టర్, 180 ఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఉన్న వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే... ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక సీఎఫ్ఎల్, ఒక సాధారణ టీవీ అన్నీ ఆరు గంటల పాటు నడుస్తాయి.
బ్యాటరీ రకం, రేటింగ్ నూ చూడాలి
బ్యాటరీల్లో ఫ్లాట్ ప్లేట్, ట్యూబులార్, మెయింటెనెన్స్ ఫ్రీ అని మూడు రకాల బ్యాటరీలు ఉంటాయి. వీటన్నింటిలోకీ ట్యూబులార్ బ్యాటరీలు ఎక్కువ మన్నికైనవి, ఎక్కువ సమర్థవంతమైనవి, ఏడెనిమిదేళ్ల వరకూ పనిచేస్తాయి కూడా. కానీ వీటి ధర ఎక్కువ. ఇక ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీలు మధ్యస్థంగా ఉంటాయి. మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీలతో కాస్త పని సులువనిపించినా మన్నిక, సమర్థత తక్కువగా ఉంటుంది. బ్యాటరీలేవైనా అప్పుడప్పుడూ డిస్టిల్డ్ వాటర్ తగిన స్థాయి వరకూ నింపుతుంటే సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక బ్యాటరీలకు సీ రేటింగ్ (కూలుంబ్ రేటింగ్) ఉంటుంది. ఎంత ఎక్కువ సీ రేటింగ్ ఉంటే బ్యాటరీ విద్యుత్ సామర్థ్యం అంత బాగుంటుంది. ఇన్వర్టర్ల కోసం సీ20 రేటింగ్ ఉన్న బ్యాటరీ తీసుకోవడం ఉత్తమం.
రిఫ్రిజిరేటర్లు, ఏసీలను వినియోగించుకోలేమా?
రిఫ్రిజిరేటర్లు, ఏసీల విద్యుత్ వినియోగం సంగతేమోగానీ.. వాటికి ప్రారంభ విద్యుత్ చాలా ఎక్కువగా అవసరం. ఉదాహరణకు 250 లీటర్ల రిఫ్రిజిరేటర్ 350 వాట్ల విద్యుత్ తోనే నడిచినా... దాని ప్రారంభ సమయంలో ఏకంగా 1500 నుంచి 2500 వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండాలి. అంటే 2500 వీఏ (2.5 కేవీఏ) సామర్థ్యమున్న ఇన్వర్టర్ అవసరమవుతుంది. అదే ఏసీలకైతే విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. అందువల్ల బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువ అవసరం పడుతుంది. ఉదాహరణకు ఒక టన్ను సామర్థ్యమున్న ఏసీ విద్యుత్ వినియోగం 1000 వాట్లు, ప్రారంభంలో అవసరమైన సామర్థ్యం 3500 వాట్లు. అంటే భారీ సామర్థ్యమున్న ఇన్వర్టర్ తోపాటు అత్యధిక శక్తి గల బ్యాటరీలు అవసరమవుతాయి. దానికి భారీగా ఖర్చు అవుతుంది. అందువల్ల సాధారణ రిఫ్రిజిరేటర్లు, ఏసీలను ఇన్వర్టర్లపై వినియోగించుకోవడం కష్టమే. కానీ ఇటీవల కొత్తగా ఇన్వర్టర్ సాంకేతికతతో రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉపకరణాలు వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఉన్నవాటికి భారీగా వీఏ సామర్థ్యమున్న ఇన్వర్టర్లు అవసరం లేదు. వాటి సాధారణ వాట్ సామర్థ్యాన్నే పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ బ్యాటరీ సామర్థ్యం మాత్రం ఎక్కువగా ఉండాల్సిందే.
కొనేముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి
  1. మార్కెట్లో ఎన్నో కంపెనీల ఇన్వర్టర్లు, బ్యాటరీలు లభిస్తున్నాయి. వాటిలో మంచి కంపెనీలేవో, నాణ్యమైన ఉత్పత్తులేవో తెలుసుకోండి. అవసరమైతే ఇంటర్నెట్లో రివ్యూలు చదవండి.
  2. కొన్ని కంపెనీలు కొన్ని రకాల ఉత్పత్తులకు దీర్ఘకాలం వారెంటీలు ఇస్తుంటాయి. ధర కాస్త ఎక్కువైనా అలాంటి వాటిని ఎంచుకోండి.
  3. ఇన్వర్టర్, బ్యాటరీ రెండూ ఒకే కంపెనీకి చెందినవి ఉంటే మేలు. ఎందుకంటే ఇన్వర్టర్ వ్యవస్థ నిర్వహణ కోసం కంపెనీల ఇంజనీర్లు వచ్చినప్పుడు రెండింటినీ పరిశీలిస్తారు. అంతేగాకుండా రెండూ ఒకే కంపెనీవి అయితే ఒకదాని ఆధారంగా మరొకటి అత్యుత్తమంగా పనిచేసేలా అభివృద్ధి చేసి ఉంటారు. అందువల్ల ఇన్వర్టర్ వ్యవస్థ సమస్యలు లేకుండా పనిచేస్తుంది.
  4. ఇన్వర్టర్ కొన్న తర్వాత దానికి ఎలాంటి నిర్వహణ అవసరాలూ దాదాపుగా ఉండవు. బ్యాటరీలను మాత్రం నిర్ధారిత సమయాల్లో పరిశీలిస్తూ ఉండాలి. ఎలక్ట్రోలైట్ (డిస్టిల్డ్ వాటర్ లేదా ఆర్వో వాటర్)ను అవసరమైన స్థాయికి నింపుతుండాలి.

0 comments:

Post a Comment